హీరోయిన్ రష్మి ఆ రోజు రాత్రి ఫోన్ చేసి ---

తనకు రావాల్సిన డబ్బు ఇవ్వకుండా.. కోర్టు నిబంధనలకు విరుద్ధంగా ‘అంతకుమించి’ సినిమాను విడుదల చేశారంటూ గౌరీశంకర్‌ప్రసాద్‌ అనే నిర్మాత బంజారాహిల్స్‌ పోలీసులను ఆశ్రయించిన విషయం విదితమే. ఈ వివాదంపై ఆ సినిమా హీరో సతీష్ జాయ్ ‘ఏబీఎన్‌’తో మాట్లాడారు. గౌరీకృష్ణ చేస్తున్న ఆరోపణలన్నీ ఫేక్ అని కొట్టిపారేశారు. అతను రూ. 50 లక్షలు పెట్టాడన్నది అవాస్తవమని, కన్నా, భాను, సతీష్ అనే ముగ్గురు కలిసి పెట్టుబడి పెట్టారాని చెప్పారు. తనకూ, ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని ఏడాది క్రితమే ఈ ముగ్గురికీ గౌరీశంకర్ ‘అంతకు మించి’ సినిమాను రాసిచ్చేశారని హీరో సతీష్ తెలిపారు. ఆ ఏడాది తర్వాత తాను సినిమాను పూర్తి చేసి, ఈ నెల 24న విడుదల చేశానని సతీష్ చెప్పారు.

‘‘కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చిన విషయం సినిమా విడుదలకు ముందు రోజు వరకు నాకు తెలియదు. స్టే ఆర్డర్ రావాలంటే ముందు నాకే రావాలి. కానీ నాకు రాలేదు. మా సినిమా హీరోయిన్ రష్మి ఆ రోజు రాత్రి ఫోన్ చేసి ‘మన సినిమాకు స్టే ఆర్డర్ వచ్చిందట కదా’ అని చెప్పే వరకు నాకు తెలీదు. అయినా మన సినిమాకు స్టే ఆర్డర్ ఎందుకు వస్తుంది? అని అడిగా.. అప్పుడు దాన్ని నేను పట్టించుకోలేదు. ఆ అగ్రిమెంట్‌లో ఉన్న ఇంకో వ్యక్తి నాకు ఫోన్ చేసి.. ‘వాట్సాప్‌లో కృష్ణ అగ్రిమెంట్ పెట్టాడు. ఏంటి అన్నా?’ అన్నాడు. నేను అప్పుడు ఏడాదిన్నర తర్వాత ఆయనతో మాట్లాడాను. మనకు ఎవరైనా రూ. 50 లక్షలు ఇవ్వాలంటే.. రోజుకు ఒకట్రెండు సార్లు ఫోన్ చేస్తారు. కానీ నాకు ఈయన ఏడాదిగా ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. మా సినిమాకు హైప్ రావడంతో బ్లాక్ మెయిల్ చేద్దామనే ఇదంతా చేస్తున్నారు. ఆయన డబ్బులు ఇచ్చినట్లు సాక్ష్యాధారాలు ఉంటే రమ్మనండి.’’ అని హీరో సవాల్ చేశారు.

నిర్మాత గౌరీశంకర్‌ప్రసాద్‌ శ్రీకృష్ణ క్రియేషన్‌ బ్యానర్‌ పేరుతో ‘అంతకుమించి’ టైటిల్‌ను రిజిస్టర్‌ చేసుకున్నాడు. సినిమా తీయడం మొదలు పెట్టాక ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో మధ్యలోనే ఆపేశాడు. కమలాపురి కాలనీకి చెందిన సతీష్‌ జాయ్‌ తానే హీరోగా, నిర్మాతగా పూర్తిచేసేందుకు ముందుకొచ్చాడు. షూటింగ్‌ మొదలుపెట్టే ముందు తాను రూ. 50లక్షలు ఖర్చు చేసినట్టు గౌరీశంకర్‌ప్రసాద్‌ చెప్పాడు. డబ్బు సినిమా విడుదలకు ముందే ఇస్తానని అతడు అంగీకరించాడు. సినిమా పూర్తవడంతో సెప్టెంబర్‌ 4న విడుదల చేస్తున్నట్టు సతీష్‌ ప్రకటించాడు. డబ్బు ఇవ్వాలని గౌరీశంకర్‌ప్రసాద్‌ అడగగా పట్టించుకోకపోవడంతో రంగారెడ్డి కోర్టును ఆశ్రయించాడు. సినిమా విడుదల ఆపేయాలని కోర్టు ఆదేశించింది. సతీష్‌ కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ శుక్రవారం సినిమా విడుదల చేశాడు. తనను మోసం చేశాడంటూ బాధితుడు బంజారాహిల్స్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు.

Comments