‘అరవింద సమేత..’ గురించి వస్తున్న ఆ వార్తల్లో నిజం లేదు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ‘కంటపడ్డావా కనికరిస్తానేమో..వెంటపడ్డావా నరికేస్తావోబా’ అంటూ తారక్‌ రాయలసీమ యాసలో చెప్తున్న డైలాగ్ హైలైట్‌గా నిలిచింది.
కాగా త్వరలో ఈ సినిమాకు సంబంధించిన రెండో టీజర్‌ను చిత్రబృందం విడుదల చేయబోతున్న‌ట్లు కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై తాజాగా చిత్రవర్గాలు ట్విటర్‌ ద్వారా క్లారిటీ ఇచ్చాయి. ‘ ‘అరవింద సమేత’కు సంబంధించిన ఫస్ట్‌ టీజర్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. త్వరలో రెండో టీజర్‌ రాబోతోందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. త్వరలో థియేట్రికల్‌ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. కానీ విడుదల తేదీ విషయంలో మాత్రం అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలో నిర్మాణ సంస్థ హారిక హాసిని క్రియేషన్స్‌ ట్రైలర్‌ విడుదల తేదీపై అధికారిక ప్రకటన ఇవ్వనుంది’ అని వెల్లడించింది.
ఈ చిత్రంలో తారక్‌కు జోడీగా పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. హారిక హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎస్‌.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. దసరాకు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.







Comments